
సమాజాభివృద్ధికి దోహదపడే రచనలు చేశా
భవానీపురం(విజయవాడపశ్చిమ): తెలుగు భాష, సాహిత్యంపై ఉన్న మక్కువతో వైద్య రంగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ తాను మాత్రం సాహిత్యం వైపే అడుగేసి సమాజానికి దోహపడే అనేక నవలలు, కథలు, నాటకాలు రచించానని తెలుగు, సంస్కృత భాషల అకాడమీ చైర్మన్ ఆర్‌డీ విల్సన్ (శరత్‌చంద్ర) పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం సంపాదకులు, రచయితలు, భాషాభిమానులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు భాష సౌందర్యం మాట్లాడటంలో, సాహిత్యం చదవడంలో ఇమిడి ఉందన్నారు. కులానికి, మతానికి భాషను ఆపాదించవద్దని కోరారు. తెలుగు, సంస్కృత అకాడమీలో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం శరత్‌చంద్రను ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వరరావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పే జానపద గేయాలు, తెలుగు సాహిత్య పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలుగు, సంస్కృత భాషల అకాడమీ
చైర్మన్ ఆర్‌డీ విల్సన్