
మాస్టర్ ట్రైనర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్థానిక ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధ్యక్షతన మంగళవారం జీరో పావర్టీ 94 పాలసీపై శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని అన్ని మండలాలు, మునిసిపాలిటీల నుంచి మొత్తం 315 మంది మాస్టర్ ట్రైనర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అర్థగణాంక శాఖ డెప్యూటీ డైరెక్టర్ కె.సౌజన్య, ప్లానింగ్ విభాగం పీఎం యూనిట్ నుంచి హారిక పాల్గొని శిక్షణ ఇచ్చారు. జీరో పావర్టీ, పీ4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల దత్తత అనంతర చర్యల కోసం ప్రామాణిక విధానాన్ని రూపొందించారని సౌజన్య, హారిక తెలిపారు. పీ–4కు దాతలు అందించే విరాళాలకు ప్రస్తుత చట్టాల ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. కొత్త కుటుంబాల చేర్పు, డూప్లికేట్, తప్పుల తొలగింపు, సవరణలు, మార్పులు సీఈఓ అండ్ ఎస్‌ఏపీఎప్ ఆమోదంతోనే అమలవుతాయని వివరించారు. మార్గదర్శుల ప్రామాణీకరణ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారని తెలిపారు. నిజమైన దాతలు, మెంటార్లు మాత్రమే బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి అనుమతి లభిస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమానికి సీపీఓ వై.శ్రీలత, ఎస్‌ఓడీ వి.ఎస్.ఆర్.ప్రసాద్, డెప్యూటీ కలెక్టర్లు ఎ.రవీంద్ర, కె.పోసిబాబు, జిల్లాలోని డీవైఎస్‌ఓ, ఏఎస్‌ఓలు పాల్గొన్నారు.