
అమ్మేసినట్లేనా?
ఉద్యోగులకు భద్రత కల్పించాలి..
ఎన్టీటీపీఎస్ సంస్థ 39 ఏళ్లుగా నిర్వహించిన బోర్డు వైద్యశాల ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వెనక కుట్ర దాగి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి ఏమవ్వాలి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ పాత వారిని కొనసాగించాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించి జీతభత్యాలు సకాలంలో చెల్లించాలని కోరుతున్నాం.
– ఎం.మహేష్, సీఐటీయూ మండల కార్యదర్శి
సంస్థే అభివృద్ధి చేయాలి..
ఎన్టీటీపీఎస్ వైద్యశాలలో ఇప్పటికే అనేకమంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సదుపాయం పొందారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం విడ్డూరంగా ఉంది. ప్రైవేట్ సంస్థకు ఏడాదికి రూ.1.49కోట్లు చెల్లించే కంటే ఆ నిధులతో వైద్యశాలలో మెరుగైన సదుపాయాలు, వైద్య పరికరాలు నెలకొల్పడం మంచిదని కోరుతున్నాం.
– గొల్లపూడి ప్రసాద్, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి
●
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ వైద్యశాల ప్రైవేట్‌పరమైంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో 1986లో ఈ వైద్యశాలను ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మూడంతస్తుల భవనంలో 30 పడకల ఆస్పత్రి, ఔట్ పేషెంట్ విభాగాలకు అప్పట్లో భవనాలు నిర్మించారు. ఐదుగురు వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 32మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు. అయితే ఆగమేఘాలపై విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ వైద్యశాలకు దీని నిర్వహణను అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు ఏడాదికి రూ.1,49,12,616 నగదు ఎన్టీటీపీఎస్ సంస్థ ప్రైవేట్ వైద్యశాలకు చెల్లించాల్సి రావడం గమనార్హం. ఆ నగదుతో ఇక్కడ వసతులు, వైద్య పరికరాలు మెరుగుపర్చాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ప్రైవేట్ పరం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగుల్లో ఆందోళన..
ఎన్టీటీపీఎస్ వైద్యశాల ప్రైవేట్ పరం కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ వైద్యశాల చేతుల్లోకి ఆస్పత్రి వెళ్లిపోయింది. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న 32మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేట్ యాజమాన్యం ఇంకా విధులు ప్రారంభించలేదు. అయితే పాత వారిలో ఏపీజెన్‌కో నుంచి 11మంది, ఆపరేషన్, మెయింటెనెన్స్ నుంచి 9మంది, ప్రాంతీయ సిబ్బంది ఇద్దరు, మరికొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. సంస్థకు చెందిన వారి స్థానంలో కొత్త సభ్యులను నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే సందిగ్ధం నెలకొంది. కొనసాగిస్తే ప్రైవేట్ యాజమాన్యం వేతనాలు గతంలో మాదిరిగా వీరికి చెల్లిస్తారా, తగ్గిస్తారా అనే సమస్య ఉత్పన్నమవుతోంది. గతంలో మాదిరిగా కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించాలని వారు కోరుతున్నారు.
ఏడాదికి రూ.1.49కోట్లు..
ఎన్టీటీపీఎస్ వైద్యశాలను మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ వైద్యశాలకు ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నెలకు రూ.12,42,718 చొప్పున ఏడాదికి రూ.1,49,12,616 నగదు చెల్లించాల్సి ఉంది. సంతృప్తికరమైన వైద్య సేవలు కాంట్రాక్టర్ అందిస్తే మొదటి ఏడాదిలో సేవల రుసుం కంటే మరో 5శాతం రెండో ఏడాది అదనంగా పెంచేందుకు నిర్ణయించారు. ఈ విషయంపై ఉద్యోగులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఎన్టీటీపీఎస్ సొమ్ము దోచిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి వృత్తి పరమైన ఆరోగ్య తనిఖీ పేరుతో వారానికి రూ.3,800 ప్రైవేట్ సంస్థకు చెల్లించాలని ఒప్పందం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రైవేట్ సంస్థకు చెల్లించే నగదుతో స్థానిక వైద్యశాలలో మెరుగైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చవచ్చని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. ఎన్టీటీపీఎస్ సంస్థ సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎన్టీటీపీఎస్ వైద్యశాల నిర్వహణ ప్రైవేట్ పరం
ఏడాదికి రూ.1.49 కోట్లు చెల్లించేలా ఒప్పందం
పని చేస్తున్న ఉద్యోగుల్లో గందరగోళం
వైద్యశాలను ఎన్టీటీపీఎస్ సంస్థే అభివృద్ధి చేయాలంటున్న ప్రజాసంఘాలు
ప్రైవేటీకరణ వెనుక
ప్రభుత్వ పెద్దల హస్తం!

అమ్మేసినట్లేనా?

అమ్మేసినట్లేనా?