
నవజాత శిశువులకు ‘తల్లి పాల బ్యాంక్’
విజయవాడ రెయిన్‌బో ఆస్పత్రిలో ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుకు తల్లి పాలు చాలా అవసరం. తల్లి అందుబాటులో లేని శిశువుల కోసం విజయవాడలోని రెయిన్‌బో ఆస్పత్రిలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవీ సరిత లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు, ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు తల్లి పాలు చాలా అవసరమని పేర్కొన్నారు. తల్లి పాలు అందుబాటులో లేని శిశువులకు ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా అందించి వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. దీనివల్ల శిశు మరణాల రేటు తగ్గించవచ్చన్నారు.
500 లీటర్ల సామర్థ్యం..
రెయిన్‌బో ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాంప్రసాద్ తల్లిపాల బ్యాంక్ ఆవశ్యకతను వివరించారు. ఎవరైనా తల్లులు తమ అదనపు పాలను ఇక్కడ దానం చేయవచ్చని సూచించారు. వాటిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన వారికి అందిస్తామన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే శిశువులను తల్లిపాలు ఓ వరం లాంటివన్నారు. దాతల నుంచి సేకరించిన సురక్షితమైన, పాశ్చరైజ్డ్ చేసిన పాలను ఈ బ్యాంక్ ద్వారా శిశువులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మదర్ మిల్క్ బ్యాంక్‌లో నిల్వ సామర్థ్యం 500 లీటర్లన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 97037 71222లో సంప్రదించవచ్చని సూచించారు. డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బీఎస్‌సిపి రాజు, డాక్టర్ శ్రీథర్, డాక్టర్ భ్రజిష్ణ తదితరులు పాల్గొన్నారు.