
రసాయన ఎరువులను తగ్గించండి
‘పొలం పిలుస్తోంది’లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను రైతులు వాడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో పొలం పిలుస్తొంది కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించి ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులతో కలిసి వరి నాట్లు వేసి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు.
అన్ని గ్రామాలలో ఉన్న పీఏసీఎస్ కేంద్రాలలో ఎరువులు అందు బాటులో ఉంటాయన్నారు. ప్రతి రైతు తనకు కావాల్సిన ఎరువులను అక్కడ నుంచి పొందవచ్చని సూచించారు.
ఉద్యానంపై దృష్టి పెట్టండి..
కేవలం వరి పంటకు పరిమితం కాకుండా ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి ఎరువులు, పురుగు మందులు వాడాలని సలహాలు ఇచ్చారు. ఎన్టీటీపీఎస్ కాలుష్యం, గ్రీన్ ఫీల్డ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో గుంటుపల్లి సర్పంచ్ భుక్యా కవిత, జిల్లా వ్యవ సాయ అధికారి విజయ కుమారి, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, ఏడీ శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు