గండ్లు.. కళ్లకు గంతలు! | - | Sakshi
Sakshi News home page

గండ్లు.. కళ్లకు గంతలు!

Jul 26 2025 9:34 AM | Updated on Jul 26 2025 9:34 AM

గండ్ల

గండ్లు.. కళ్లకు గంతలు!

సాక్షి ప్రతినిధి, విజయవాడ: నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అధికారులే, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు దాపోహమయ్యారు.. సాంకేతిక అనుమతి లేకుండా.. కనీసం వర్క్‌ ఆర్డర్‌ ఇవ్వకుండా.. నోటి మాటపై రూ.43.91 కోట్ల విలువైన 126 పనులు పప్పూ బెల్లాల్లా పంచేశారు. వాటిని అందిపుచ్చుకున్న కాంట్రాక్టర్‌లు వెంటనే పనులు ప్రారంభించేశారు. తూతూ మంత్రంగా కానిచ్చేసి.. బిల్లులు చేసుకొని కోట్ల రూపాయలు దోచుకొనేందుకు స్కెచ్‌ వేశారు. ఈ విషయమై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో కొంత మంది సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించి, పనులకు సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలని కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇదీ జిల్లాలో సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే..

బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న 126 పనులు చేపట్టడానికి జీవో నంబర్‌ 271 ప్రకారం రూ.43.91కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. అయితే ఈ పనులకు సాంకేతిక అనుమతులు ఇవ్వలేదు. టెండర్లు పిలువలేదు. అయినప్పటికీ గత మే నెలలోనే కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేశారు. కనీసం ఈ పనులకు నామినేషన్‌ పద్ధతి ద్వారా చేసేందుకు సైతం అనుమతి తీసుకోలేదు. అయితే అధికారులు అత్యవసర పరిస్థితుల్లో పనులు చేశామని స్వయంగా పేర్కొనడంతో దీని వెనుక కుట్ర బహిర్గతం అయ్యింది. ఇప్పుడు ఈ పనులకు పాత తేదీల్లో సాంకేతిక అనుమతులు ఇచ్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మరికొన్ని పనులను అత్యవసర పరిస్థితుల్లో రైతులే పూర్తి చేసుకున్నారు. అయితే ఆ పూర్తయిన పనులకు ఇప్పుడు ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేయడం హాస్యాస్పదంగా మారిందని నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనిబట్టే ఈ పనుల్లో అవినీతి వ్యవహారం బట్టబయలు అవుతుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా కలెక్టర్‌, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు సైతం పలువురు ఫిర్యాదులు చేశారు.

ప్రొసీజర్‌ పాటించనేలేదు..

పనులు ప్రారంభానికి ముందు ప్రాథమిక కొలతలు తీసుకొని ఎంబుక్‌లో సంబంధిత ఏఈ, డీఈఈ, ఈఈ ఎంబుక్‌లో రికార్డు చేయాలి. పనులు పూర్తయ్యాక మరోసారి కొలతలు తీసుకొని, ప్రాథమిక కొలతలకు, పనులు పూర్తి అయ్యాక తీసుకున్న కొలతలతో సరిపోల్చి, చేసిన పనులకు ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లు) ప్రకారం బిల్లుల చెల్లింపులకు రికార్డు చేసి పీఏఓ (పే అండ్‌ అకౌంట్‌) ఆఫీసుకు పంపాలి. కానీ బుడమేరు మరమ్మతు పనుల్లో ప్రాథమిక కొలతలు తీసుకొన్న దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ఎంత పనులు చేశారన్నది లెక్క కట్టలేని పరిస్థితి. దీనినే ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్లు, ఓ కీలక ప్రజా ప్రతినిధి, భారీ ఎత్తున పనులు చేసినట్లు మాయ చేసి.. కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేసినట్లు అర్థమవుతోంది. తాజాగా పనులకు నీటి పారుదల శాఖ అధికారులు ఎస్టిమెంట్‌లు తయారు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆ అధికారే కీలకం..

బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల్లో ఇష్టారాజ్యం

నోటిమాటపై రూ. 43.91 కోట్ల

విలువైన పనులు

ఎలాంటి అనుమతుల్లేకుండా

చేపట్టిన వైనం

ఇప్పటికే ఈ అంశంపై వరుస

కథనాలు ప్రచురించిన ‘సాక్షి’

ఉన్నతాధికారులకు సైతం

ఫిర్యాదుల వెల్లువ

ఇప్పుడు కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన

సామాజిక కార్యకర్తలు

కమీషన్ల కక్కుర్తితో పనులు

చేయించిన అధికారులకు చెమటలు

బుడమేరు వరద పనుల వ్యవహారంలో ఓ నీటి పారుదల శాఖ అధికారి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి, పనుల కేటాయింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయనకు ప్రజా ప్రతినిధులకు తలలో నాలుకల మారి అడ్డగోలుగా వారి పనులను చక్కబెట్టడంలో దిట్టగా పేరుంది. తమకు అనుకూలమైన కింది స్థాయి అధికారులను కోరే చోట వేయించేందుకు, ప్రజా ప్రతినిధుల వద్ద ఇతనే స్వయంగా సిఫారసు లేఖలు తెచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇటీవల తిరువూరులో నీటి పారుదల శాఖ ఏఈ బదిలీ అయిన, ఆయన రిలీవ్‌ కాకుండా వేధించడంలో కీలక భూమిక పోషించినట్లు శాఖ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఇతని వ్యవహారంపైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసినా ఇతనిలో మార్పు లేదనే భావన వ్యక్తం అవుతోంది. ప్రజా ప్రతినిధుల అండతోనే రెచ్చి పోతున్నారనే చర్చ నీటి పారుదల శాఖ వర్గాల్లోనే నడుస్తోంది.

గండ్లు.. కళ్లకు గంతలు! 1
1/1

గండ్లు.. కళ్లకు గంతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement