
మంత్రి అచ్చెన్నాయుడుకి సమస్యలతో స్వాగతం
పాయకాపురం(విజయవాడరూరల్): సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లో టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. నియోజకవర్గం పరిశీలకుడిగా వచ్చిన మంత్రికి స్థానిక మహిళలు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, తల్లికి వందనం ఆర్థిక సహాయం అందలేదని, రేషన్ కార్డులు మంజూరు కాలేదని, తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు.
● రామాలయం సమీపంలో నడుస్తున్న మంత్రికి సబ్బినేని ప్రభుకుమారి.. తమది చాల పేద కుటుంబమని, తనకు ముగ్గురు ఆడపిల్లల సంతానమని, ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం ఇప్పించాలని కోరారు. 13 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నామని అద్దె చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేసే సందర్భంలో ఇస్తామని మంత్రి చెప్పారు.
● పిచ్చమ్మ అనే పేదరాలు కూడా తమ కుటుంబం ఎంతో కాలం నుంచి ఇళ్ల స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తమ పాప 4వ తరగతి చదువుతోందని, తల్లికి వందనం పథకంలో ఆర్థిక సహాయం అందలేదని ఆమె తల్లిదండ్రులు మంత్రికి విన్నవించుకున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఆర్థిక సహాయం అందకపోయి ఉండవచ్చని సచివాలయానికి వెళ్లి సమస్య తెలుసుకొని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వారికి సూచించారు. ఈ విధంగా అనేక సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. పాదయాత్ర చేస్తుండగా మధ్యలో వర్షం రావడంతో జనం వెళ్లిపోవడం సర్దుకోవడం కనిపించింది.
వైకుంఠపాళి ఆడటం మానుకోవాలి..
అనంతరం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను కొన్ని అమలు చేశామని, మిగిలినవి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రజలు వైకుంఠపాళి ఆట మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.240కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రేటింగ్ విషయంలో జిల్లాలో మొదటి స్థానంలో నియోజకవర్గం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కె.రవికుమార్, ఎస్‌కే బాబు, సతీష్, నాగరాజు, భాగ్యలక్ష్మి, శివమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.