ఆశల సేద్యం | - | Sakshi
Sakshi News home page

ఆశల సేద్యం

Jul 22 2025 6:34 AM | Updated on Jul 22 2025 9:27 AM

ఆశల స

ఆశల సేద్యం

వరుణ నైవేద్యం..
కృష్ణమ్మ రాకతో రైతుల్లో హర్షాతిరేకాలు

జలకళ.. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ

సాక్షి,ప్రతినిధి, విజయవాడ: జల సవ్వడులతో కృష్ణాతీరం పులకిస్తోంది. వరుణ నైవేద్యంతో అన్నదాత ఆశల సేద్యాన్ని ఆరంభించాడు. మన జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అరకొరగా అందుతున్న సాగునీటితో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి సాగు చేపట్టగా.. ఇప్పుడు పుష్కలంగా అందుతున్న నీటితో మిగిలిన ప్రాంతాల్లోని రైతులు అమితానందంతో సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని చివరి భూముల రైతులకు ఈ వర్షాలు కొత్త ఊపిరిని పోశాయి.

సాగుకు కొత్త జీవం..

ఉమ్మడి జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,62,123 హెక్టార్లు కాగా, 64,675 హెక్టార్లలో ఇప్పటికే వరి పంట సాగైంది.

● ఎన్టీఆర్‌ జిల్లాలో సాధారణ సాగు 94,931 హెక్టార్లు కాగా, 38,789 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వరి సాధారణ సాగు 48,167 హెక్టార్లు కాగా, 6,126 హెక్టార్లలో పంట సాగైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మెట్ట పంటకూ ఊపిరి పోస్తున్నాయి. కంది, మొక్కజొన్న, పెసలు, మినుములు పంటలకు మేలు చేకూరుతోంది. జిల్లాలో పత్తి సాధారణ సాగు 36,254 హెక్టార్లు కాగా, 26,909 హెక్టార్లలో సాగైంది.

● కృష్ణా జిల్లాలో సాగునీటి కాలువలు అధ్వానంగా ఉండటంతో, చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు అల్లాడిపోయారు. పెడన, గుడి వాడ, పామర్రు నియోజకవర్గాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరట నిస్తున్నాయి. వరినాట్లు జోరందుకున్నాయి. ఈనెల చివరి నాటికి అవనిగడ్డ ప్రాంతం మినహా మిగతా ప్రాంతాల్లో వరి సాగు దాదాపు పూర్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత..

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల నీరు ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలువలకు సైతం నీరు తగ్గించారు. సోమవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 7,250 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. కాలువలకు 3,522 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద ప్రభావం తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీ నాలుగు గేట్లు, ఒక అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇంకా రెండు, మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బ్యారేజీకి ప్రవాహం అలాగే కొనసాగే అవకాశం ఉంది.

ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న నీరు దిగువకు నీటిని వదులుతున్న అధికారులు కృష్ణా డెల్టాలో ముమ్మరంగా ఖరీఫ్‌ పనులు ఇప్పటికే 65వేల హెక్టార్లలో వరి సాగు

ఊపిరి పీల్చుకున్నాం..

నిన్న, మొన్నటి వరకు నీరందని దుస్థితి ఉంది. ఇప్పుడు నీరు పుష్కలంగా రావడమే కాకుండా కాలువల ద్వారా కూడా నీరొచ్చింది. పంటలకు బాగా నీరందుతోంది. వెదసాగు వేసుకున్నవి చనిపోవడంతో నారుకొని ఊడ్పులు ఊడ్చుకుంటున్నాం. నారు వేసిన వారు అధికంగా ఉన్న నారును విక్రయించుకుంటున్నారు. సమయానికి నీరందడంతో ఊపిరి పీల్చుకున్నాం.

– గరికిముక్కు నాంచారయ్య, రైతు, లంకలకలువగుంట, పెడన మండలం

వరి నాట్లు ప్రారంభించాం..

రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వరి నాట్లను ప్రారంభించాం. పంట కాలువల్లో సాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల వరి నాట్లు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. మరో రెండు మూడు రోజులపాటు ఇదే విధంగా వర్షాలు కురిస్తే నాట్లు పూర్తయ్యే అవకాశం ఉంది. వర్షం పడటం వల్ల రైతన్నలందరికీ మేలు జరుగుతుంది.

– సుబ్బారావు, కౌలు రైతు గుడివాడ

వర్షంతో వరి పంటకు మేలు..

తొలకరి రాగానే వరి నారు సిద్ధం చేసుకుని నాట్లు వేసుకున్నాం. మొన్నటి వరకూ వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా ఎండలు అధికంగా కాశాయి. దీంతో పైర్లు ఎండుముఖం పట్టాయి. బోదెల్లో ఉన్న నీటిని వినియోగించుకుని పైర్లు సంరక్షించుకుంటున్నాం. ఈ తరుణంలో కురిసిన భారీ వర్షాలు వరి పంటకు మేలు చేశాయి. పైర్లు ఊపిరిపోసుకున్నాయి. పంట బోదెల తవ్వకం పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తే పొలాల్లో మురుగు మళ్లించుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. – నకరికంటి శేఖర్‌, కౌలురైతు, ఈడుపుగల్లు

ఆశల సేద్యం1
1/4

ఆశల సేద్యం

ఆశల సేద్యం2
2/4

ఆశల సేద్యం

ఆశల సేద్యం3
3/4

ఆశల సేద్యం

ఆశల సేద్యం4
4/4

ఆశల సేద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement