
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
– ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి. పుల్లారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు హాలులో సోమవారం సాయంత్రం విద్యుత్‌శాఖ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలపై ఆయన డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల బకాయిలను ఉన్నతాధికారులతో మాట్లాడి తాము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వేతర కార్యాలయాలు గాని, వినియోగదారుల నుంచి దీర్ఘకాలిక పెండింగ్ ఏమైనా ఉంటే సత్వరమే వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి జిల్లాలో 2,500 కనెక్షన్లు ఇచ్చామని, ప్రస్తుతం ఇంకా 550 కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ పఽథకం ద్వారా జిల్లాలో 1860 సోలార్ కనెక్షన్లు ఇచ్చామని ప్రతి నెల 300 కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. ఏఈ, లైన్‌మెన్, గ్రేడ్–2 జూనియర్ లైన్‌మెన్లకు పోస్టింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఆపరేషన్స్ డైరెక్టర్ మురళీకృష్ణయాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ పీవీఎస్‌ఎన్ మూర్తి, ఏపీసీపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం. సత్యానందం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.