
13న ఇండో–అమెరికన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి నిరసన
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇండో– అమెరికన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు 13న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో కూటమి ప్రభుత్వం రైతుల నుంచి భూములను సేకరించి కార్పొరేట్లకు కట్టబెట్టే లక్ష్యంతో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయతలపెట్టడాన్ని రైతుసంఘం ఖండిస్తోందన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సేకరణకు నిరసనగా ప్రజలు సాగిస్తున్న ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ఇప్పటి వరకు వివిధ ప్రాజెక్టుల పేరుతో సేకరించిన భూ వివరాలతో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఆచరణ యోగ్యం కాని భారీ ఖర్చుతో కూడుకున్న పోలవరం– బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం సరైంది కాదన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జములయ్య, రైతుసంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడు యల్లమందరావు పాల్గొన్నారు.