అమృత్‌ భారత్‌ స్టేషన్ల పనులు వేగిరం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ భారత్‌ స్టేషన్ల పనులు వేగిరం చేయాలి

Jul 25 2025 8:13 AM | Updated on Jul 25 2025 8:13 AM

అమృత్‌ భారత్‌ స్టేషన్ల పనులు వేగిరం చేయాలి

అమృత్‌ భారత్‌ స్టేషన్ల పనులు వేగిరం చేయాలి

దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎం ఎన్‌.రమేష్‌

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డివిజన్‌లో జరుగుతున్న అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీసీసీఎం) ఎన్‌.రమేష్‌ అధికారులను ఆదేశించారు. విజయవాడ డివిజన్‌ కమర్షియల్‌ విభాగం పనితీరు, గూడ్స్‌షెడ్‌ల అభివృద్ధి, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పనుల పురోగతిపై గురువారం ఆయన డివిజనల్‌ కార్యాలయంలో డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌, ఫ్రైట్‌ సర్వీసెస్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సాంబశివరావు, ప్యాసింజర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ డి.సత్యనారాయణలతో కలసి పీసీసీఎం రమేష్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్‌ డివిజన్‌ వ్యాప్తంగా పనులు జరుగుతున్న 15 గూడ్స్‌ షెడ్‌ల పురోగతిని సమగ్రంగా వివరించారు. వాటిలో ఐదు గూడ్స్‌ షెడ్‌లు ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే కార్గో సామర్థ్యం పెరిగి, సరుకు రవాణా ఆదాయం పెరుగుతుందని వివరించారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ల పనుల పురోగతిని వివరించి గుర్తించిన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిచేసే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు వివరించారు.

డివిజన్‌లో గూడ్స్‌ షెడ్‌లు, స్టేషన్‌ల పునరాభివృద్ధి పనుల్లో డివిజన్‌ పురోగతిపై పీసీసీఎం రమేష్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. అప్రోచ్‌ రోడ్లు, సీసీటీవీ ఇన్‌స్టాలేషన్‌లు, కవర్‌ ఓవర్‌ ప్లాట్‌ఫాం పనులు, గూడ్స్‌ షెడ్‌లలో కార్మికుల సౌకర్యాలను వేగవంతం చేయాలని సూచించారు. పనుల సమయంలో అన్ని భద్రత ప్రొటోకాల్స్‌, పర్యావరణ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సరుకు రవాణా ఆదాయం పెంచేందుకు స్థానిక మార్కెట్‌ డిమాండ్‌లను విశ్లేషించి ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. రైల్‌ మదద్‌ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం టీటీఈలతో మాట్లాడి రోజువారీ విధుల్లో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఏడీఆర్‌ఎంలు పీఈ ఎడ్వీన్‌, కొండా శ్రీనివాసరావు, సీనియర్‌ డీసీఎం వావిలపల్లి రాంబాబు, పలువురు బ్రాంచ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement