
‘శాతవాహన’ను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): శాతవాహన కళాశాలకు చెందిన స్థలాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని కళాశాలను నిర్వహించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిటెండ్ పి.రవిచంద్ర అన్నారు. శాతవాహన కళాశాలను పునఃప్రారంభించాలని కోరుతూ శాతవాహ న కళాశాల పరిరక్షణ కమిటీ, విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు సంయుక్త ఆధ్వర్యంలో సోమ వారం ఉదయం కళాశాల గేటు దగ్గర ఆందోళన చేశారు. కళాశాల గేటు తెరిపించి విద్యార్థి సంఘాల నాయకులు, పరిరక్షణ కమిటీ సభ్యులు కళాశాల మైదానంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి..
ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ శాతవాహన కళాశాలను జూన్ 6వ తేదీన కోర్టు ఉత్తర్వుల పేరుతో బోయపాటి వర్గీయులు కళాశాల భవనాలను కూల్చివేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని, ఉన్నత విద్యామండలి వారు డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ప్రకటించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. వందల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోకపోవడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ వి.సాంబరెడ్డి, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కుమార్‌స్వామి, శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర
దరఖాస్తు చేసుకోండి..
అనంతరం కళాశాల ఆవరణలో పరిరక్షణ కమిటీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు టెంట్లు వేసి కూర్చున్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు మాట్లాడుతూ అడ్మిషన్లను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.