
రిజిస్ట్రేషన్ స్టాంప్‌ల చోరీ ముఠా అరెస్ట్
గన్నవరం: స్టాంప్‌లు చోరీచేసిన దొంగలముఠాను శుక్రవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ సిహెచ్. శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ తలుపులు పగులకొట్టి బీరువాలోని రూ.13.56 లక్షల విలువైన స్టాంప్‌లను అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులు విసన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, దొంగిలించిన స్టాంప్‌లను విక్రయించేందుకు విజయవాడ వెళ్తున్న ప్రధాన నిందితుడైన వడ్లమూడి చెన్నరావు, ఆతనికి సహకరించిన వడ్లమూడి రాంబాబు, వడ్రాణపు శ్రీనివాసరావును ఆగిరిపల్లి వద్ద అదుపులో తీసుకున్నారు. అనంతరం వీరిని విచారించగా గన్నవరంతోపాటు 2023లో పటమట సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో చోరీకి విఫలయత్నం చేయడంతోపాటు 2024లో రూ. 8 లక్షల స్టాంప్‌లను అపహరించినట్లు నిందితులు అంగీకరించారు. తాతకుంట్లకు చెందిన చెన్నరావు పటమటలో ఓస్టాంప్ వెండర్ వద్ద పనిచేస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరి వద్ద నుండి రూ. 14 లక్షల విలువగల స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు చెన్నరావు కాలికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పారు. ఈ కేసులో అదుపులో తీసుకున్న ఏనుగు అంకినీడు పాత్రపై లోతైన విచారణ చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా వీరి నుంచి స్టాంప్‌లను కొనుగోలు చేసి విక్రయిస్తున్న స్టాంప్ వెండర్ విఠలరావుకు కూడా నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. ఈ కేసును వేగవంతంగా చేధించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. గన్నవరం సీఐ బీవీ.శివప్రసాద్, సీసీఎస్ సీఐ ఆర్. గోవిందరాజు, ఎస్‌ఐ వీరవెంకటేశ్వరరావు, లాఅండ్‌అర్డర్ ఎస్‌ఐ శ్రీధర్, క్రైం హెడ్‌కానిస్టేబుల్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.