
ఉద్యాన పంటల సాగు విస్తృతంగా చేపట్టాలి
గన్నవరం రూరల్: రైతులు ఉద్యాన పంటల సాగును విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ సూచించారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామంలో ఆ శాఖ కమిషనర్ ఎం.వి.కృష్ణతేజతో కలసి మామిడి మొక్కలు నాటే కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన బండి శ్రీనివాసరెడ్డి 3.16 ఎకరాల్లో 221 మామిడి మొక్కలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నాటారు. ఈ సందర్భంగా శశిభూషణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటల సాగు చేపట్టడం లక్ష్యమని తెలిపారు. ఏటా ఉద్యాన పంటల సాగును పెంచుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం ఒక్క రోజూ రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును ప్రారంభించామని వివరించారు. రైతులకు ఉపాధి పథకం ద్వారా చేయూత, సబ్సిడీలు అందజేస్తూ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్ ఆరేపల్లి జేజమ్మ, పంచాయతీ రాజ్ డైరెక్టర్ షణ్ముఖకుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.వి.శివ ప్రసాద్, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీపీఓ అరుణ, ఎంపీడీఓ స్వర్ణ లత, ఏపీఓ రాజు, ఎఫ్‌ఏ నాయక్, పలువురు ఉపాధి కార్మికులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్