
నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మన నుంచి దూరమైనా ప్రజల మదిలో పదిలంగా కొలువై ఉన్నారు. ఆరోగ్య శ్రీతో పేదల గుండెల్లో ఊపిరయ్యారు. జలయజ్ఞంతో అపర భగీరథుడయ్యారు. సంక్షేమం, అభివృద్ధి అంటే ఏమిటో తన పాలనలో చేసి చూపించి సిసలైన ప్రజానాయకుడిగా జేజేలు అందుకు న్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. తన పాలనతో జిల్లా వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మంగళవారం ఆయన 76వ జయంతి సందర్భంగా జిల్లాకు చేసిన అభివృద్ధిని జిల్లా వాసులు మరో సారి మననం చేసుకుంటు న్నారు. వైఎస్సార్ అనే పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మనకళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. ‘నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా... నమస్తే తమ్ముడూ’ అంటూ ఆయన పలికే మాటలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. 108 అంబులెన్సులను తీసుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎందరినో బతికించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణా విశ్వవిద్యాలయం, నూజివీడు ట్రిపుల్ ఐటీ, నాగాయలంక మండ లంలో తొలి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, కృష్ణా కరకట్ట రోడ్డు నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ‘రాజన్న’ ముద్ర
2008 జూన్ ఆరో తేదీన అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
కృష్ణా డెల్టా పరిధిలో 13.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా రూ.4,573 కోట్లతో ఆధునికీకరణ పనులకు పరిపాలనా అనుమతులిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.2,180 కోట్లు వెచ్చించారు. వైఎస్ హయాంలోనే ఈ పనుల్లో 40 శాతానికి పైగా పూర్తయ్యాయి.
2008 ఏప్రిల్ 23వ తేదీన రూ.1,500 కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని పోర్టు పనులను ఆయన తనయుడు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో ముందుకు తీసుకెళ్లారు. పోర్టు పనులను పరుగులు పెట్టించారు.
కృష్ణా డెల్టాకు ఆయువుపట్టయిన పులిచింతల ప్రాజెక్టును నిర్మించి ప్రజలకు అందించారు.
అవనిగడ్డ, విజయవాడ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు అప్పటి వరకూ సింగిల్ రోడ్డుగా ఉన్న కృష్ణానది కరకట్టను రెండు లైన్ల రహదారిగా విస్తరించారు.
నాగాయలంక మండలం భావదేవరపల్లిలో రాష్ట్రంలో తొలి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు.
నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఈ కళాశాలలో ఏటా వేల మంది గ్రామీణ పేద విద్యార్థులు సాంకేతిక విద్యను ఉచితంగా అందుకుంటున్నారు.
ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇప్పటికీ ఉమ్మడి కృష్ణా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకొన్న వైఎస్సార్ జయంతి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆయన అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యక్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి విడదీయరాని అనుబంధం
ఆధునికీకరణ పనులతో కృష్ణాడెల్టా ఆయకట్టుకు జీవం పోసిన వైఎస్సార్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.వేలకోట్ల అభివృద్ధి పనులు చేపట్టిన వైనం
జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు

నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి