
సమయపాలన పాటించకుంటే సస్పెన్షనే..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో సమయపాలన పాటించని అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని డీఆర్వో నుంచి అధికారులకు సమాచారం అందించారు. కొందరు అధికారులు సమావేశానికి ఆలస్యంగా రావడాన్ని కలెక్టర్ గమనించి, అసహనం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంబంధించి ఎదురయ్యే సమస్యలపై సమీక్షించి, వాటికి పరిష్కారం చూపేందుకు 9.30 గంటలకల్లా గ్రీవెన్స్‌కు హాజరుకావాలని పంపిన సమాచారాన్ని కొందరు జిల్లా అధికారులు బేఖాతరు చేయడం, విధులపై అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు గ్రీవెన్స్ హాల్ డోర్లు మూసివేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చిన, గైర్హాజరైన అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
పీజీఆర్‌ఎస్‌లో 138 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 138 అర్జీలు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 53, పోలీస్ 23, ఎంఏయూడీ 17 అర్జీలు అందాయి. పౌరసరఫరాలు, హెల్త్, పీఆర్ శాఖలకు సంబంధించి ఆరు చొప్పున, కలెక్టరేట్, డీఆర్‌డీఏకు మూడు చొప్పున, వ్యవసాయం, డ్వామా, విద్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సర్వే, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, విభిన్నప్రతిభా వంతలు, అగ్నిమాపక, కేడీసీసీ బ్యాంకు, ఎల్‌డీఎం, గనులు–భూగర్భ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, ఆర్‌ఐఓ, ఆర్‌డబ్ల్యూఎస్, రవాణా శాఖలకు సంబంధించి మిగిలిన అర్జీలు అందాయి.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..
● తమ గ్రామంలోని ఆర్‌ఎస్ నంబరు 63లో ఉన్న చెరువులోమట్టి అక్రమ రవాణా జరుగుతోందని, ఐదు వేల క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకొని లక్షకు పైగా క్యూబిక్‌మీటర్లు అక్రమంగా తవ్వి ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్‌వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారని విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లికి చెందిన జమలయ్యతోపాటు మరికొందరు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
● గత ప్రభుత్వంలో కేంద్ర ఆయుష్, విద్యాశాఖల సంయుక్త ఆదేశాలనుసారం బుద్ధ యోగ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలోని 907 పాఠశాలలో 1,056 మంది యోగ శిక్షకులుగా నియమితులయ్యారని, వారిని ప్రత్యక్షంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు అర్జీ అందజేశారు.
జిల్లా అధికారులపై కలెక్టర్ లక్ష్మీశ ఆగ్రహం