
ప్రజా రహదారులు బందీ!
కోడూరు: ప్రజలు రాకపోకలు సాగించేందుకు లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లకు ప్రయివేటు వ్యక్తులు గేట్లు ఏర్పాటు చేసిన ఘటన కోడూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హంసలదీవి పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.17.80 లక్షలతో 300 మీటర్ల మేర నూతన సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామంలోని వేణుగోపాలుడి ఆలయ పక్కనే ఉన్న చెరువు చుట్టూ ఈ రోడ్ల నిర్మాణాలను నాలుగు నెలల క్రితం చేపట్టారు. పంచాయతీరాజ్ అధికారులు ఈ రోడ్ల నిర్మాణాలు చేసి, లాంఛనంగా ప్రారంభించారు.
రహదారులకు గేట్లు
అయితే కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లపై గ్రామస్తులు రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా కొంతమంది ప్రయివేటు వ్యక్తులు గేట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి, వేణుగోపాలుడి ఆలయం, కాశీవిశ్వేశ్వర స్వామివారి ఆలయాల వద్ద ఈ గేట్లను సీసీ రోడ్లకు అడ్డుగా ఏర్పాటు చేశారు. 300 మీటర్ల రహదారి మొత్తం నాలుగు గేట్లను ప్రయివేటు వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. వేణుగోపాలుడి ఆలయ నిర్వహణ చేపడుతున్న వ్యక్తులే ఈ గేట్లను ఏర్పాటు చేశారని, రోడ్లపై ఎవరూ నడవడానికి వీలు లేకుండా గేట్లకు తాళాలు వేశారని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి
ఈ రహదారులు వెంట గ్రామస్తులు నడవడానికి వీల్లేదని ఆలయ నిర్వాహకులు బాహాటంగానే చెబుతున్నట్లు హంసలదీవి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సీసీ రోడ్లకు అడ్డుగా ఏర్పాటు చేసిన గేట్లను వెంటనే తొలగించాలని హంసలదీవి గ్రామస్తులు కోరుతున్నారు.
హంసలదీవిలో నూతన సీసీ రోడ్లపై వెళ్లకుండా గేట్లు ఏర్పాటు ప్రజల ఆగ్రహం రూ.17.80లక్షలతో నిర్మించిన రోడ్లు నిరుపయోగం గేట్లకు తాళాలు ఉన్నతాధికారులు స్పందించాలి

ప్రజా రహదారులు బందీ!

ప్రజా రహదారులు బందీ!