
లారీ ఢీకొని యువకుడి మృతి
వత్సవాయి: వేగంగా వస్తున్న లారీ ఓ ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున వత్సవాయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్‌తో ఇసుకను గ్రామంలో అవసరమైన వారికి సరఫరా చేస్తుంటారు. తెల్లవారుజామున ఇసుకను ట్రాక్టర్‌లో నింపుకుని రావడానికి నలుగురు కలిసి ట్రాక్టర్ తీసుకుని లింగాల మునేటి వద్దకు వెళ్తున్నారు. గ్రామశివారులో రహదారి పక్కన ట్రాక్టర్ నిలిపారు. ఇంతలో వైరా వైపు నుంచి లారీ వేగంగా వచ్చి నిలిపిఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న వారు రహదారిపై పడగా డ్రైవర్ సీటులో ఉన్న చల్లా వేణు(21) రోడ్డుపై పడ్డారు. ట్రాక్టర్ తిరగబడి ఇతనిపై పడింది. ఘటనలో వేణు అక్కడిక్కడే మృతిచెందగా బాలు, ఆర్.రాంబాబు, సీహెచ్ రాముడుకు గాయాలయ్యాయి. వీరిని మెరుగైన చికిత్స కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు.
గ్రామస్తుల వాదన మరోలా..
ఘటనపై గ్రామస్తుల వాదన మరో రకంగా ఉంది. రహదారి పక్కనే పీఎస్‌కు కూతవేటు దూరంలో ఉన్న మద్యం బెల్టుషాపు కారణంగా ఘటన జరిగిందని చెబుతున్నారు. తెల్లవారుజామునే బెల్టుషాపు వద్ద రహదారిపై ట్రాక్టర్‌ను నిలిపి ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తుల చర్చించుకుంటున్నారు. కేవలం బెల్టుషాపు వల్లనే నిండుప్రాణం పోయిందంటున్నారు.
అతనే ఆధారం
వేణు కూలిపనులు చేస్తుంటాడు. ఇటీవల అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడాది వయసున్న కుమారుడున్నాడు. కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని తల్లి, భార్య విలపిస్తున్న తీరు చూపరుల కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి. ఘటనపై వేణు భార్య భవాని స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేటకు తరలించారు. వేణు మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు వైద్యశాలకు వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.
మద్యం బెల్టుషాపు వల్లనే ప్రమాదం అని గ్రామస్తుల ఆరోపణ

లారీ ఢీకొని యువకుడి మృతి