విస్మరించొద్దు!
విస్తరిస్తోంది..
క్రమంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఐదేళ్ల కిందట గడగడలాడించిన కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. నగరంలోనూ పలువురు దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రి కోవిడ్ వార్డులో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతుండగా, నిర్ధారణ కాకుండా ఇంకా ఎక్కువ మందే ఉంటున్నట్లు భావిస్తున్నారు. అంతేకాక వేర్వేరు వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడినట్లు తెలిసింది. వారి మృతికి కోవిడ్ కారణం కాదని వైద్యులు అంటున్నారు. కోవిడ్‌పై ప్రజలు అప్రమత్తం కాకుంటే మరోసారి దాని ప్రతాపం చూపుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ముగ్గురు మృతి..
● అదుపులో లేని మధుమేహం, రక్తపోటుతో తీవ్రంగా నీరసించిన 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను అడ్మిట్ చేసిన వైద్యులు కోవిడ్ పరీక్ష కూడా చేశారు. ఆ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. కాగా ఆమె పరిస్థితి విషమించి వారం రోజుల కిందట మృత్యువాత పడింది.
● న్యూరో సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం జ్వరం రావడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయడంతో పాజిటివ్ వచ్చింది. అంతేకాక ఐదు రోజుల కిందట అతనూ మృత్యువాత పడ్డాడు.
● గిరిపురానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాస సమస్యతో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అతనిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా గురువారం ఉదయం 7 గంటల సమయంలో మృత్యువాత పడ్డాడు.
పెరుగుతున్న బాధితులు..
కోవిడ్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ వార్డులో నలుగురు రోగులు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. సాధారణ వ్యాధులతో వచ్చిన వారికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. అలా చేస్తున్న వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్ వస్తోంది. అలాంటి వారిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
విజయవాడ జీజీహెచ్‌కు వస్తున్న రోగులు ఇప్పటికే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన ముగ్గురు మృతి ఇతర వ్యాధులతో వచ్చిన వారికి పరీక్ష చేస్తే కోవిడ్ పాజిటివ్ ఏ మాత్రం అప్రమత్తం చేయని ప్రభుత్వం దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం
అప్రమత్తత ఏదీ?
ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ప్రజలను ఏమాత్రం అప్రమత్తం చేయడం లేదు. అవగాహన కల్పించడం లేదు. దీంతో ప్రజల రద్దీ ప్రాంతాల్లో సైతం మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకరి నుంచి మరొకరికి సోకి తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేక పోలేదని ఒక సీనియర్ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.
స్వీయ రక్షణ అవసరం..
ప్రజలు అవకాశం ఉన్నంత వరకూ రద్దీ ప్రాంతాల్లో తిరగడం మానుకోవాలని.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతులను తరచూ శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకూ ఎవరితోనూ కరచాలనం చేయవద్దంటున్నారు. ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఎవరిలో అయిన కనిపిస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడంతో పాటు ఇంట్లోనే క్వారంటైన్ అవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు.
విస్మరించొద్దు!


