
ఖాళీల జాబితా విడుదల చేయాలని వినతి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీలలో ప్రిఫరెన్షియల్ కేటగిరీకి 50 శాతం కోరుకునే అవకాశమున్న ఉన్నత పాఠశాలల్లోని ఖాళీల జాబితా విడుదల చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు బదిలీలకు సంబంధించిన సమస్యలను జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును వివరించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ బదిలీల జీఓ ప్రకారం 2021కి ముందు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇవ్వవలసి ఉండగా ఎంఈఓలు నిరాకరించారన్నారు. దీంతో ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొందన్నారు. ప్రస్తుతం జరగబోతున్న ఉద్యోగోన్నతులకు మాన్యూవల్ కౌన్సెలింగ్ జరపాలన్నారు. మ్యూజిక్ టీచర్స్ బదిలీ ఆన్‌లైన్ దరఖాస్తులకు మే 27వ తేదీ చివరి రోజు కాగా ఓపెన్ కాలేదని, అప్లికేషన్లు ఓపెన్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జిల్లా కార్యదర్శి ఎన్. సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.