
ట్రయల్ సీడ్ సాగును నిషేధించాలి
మైలవరం: రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్రయల్ సీడ్ సాగును ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, విత్తన రైతుల సంఘం కన్వీనర్ బి. రాము, సీపీఐ మైలవరం మండల కార్యదర్శి బుద్దవరపు వెంకట్రావు తదితరుల ప్రతినిధుల బృందం ఎన్టీఆర్ జిల్లా మైలవరం డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. శ్రీనివాసరావుకు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, రైతులు, సీడ్ ఇచ్చే కంపెనీల ప్రతినిధులు మధ్య లిఖితపూర్వక ఒప్పందం చేసుకున్న తర్వాతే సీడ్ సాగును ప్రోత్సహించాలని, అలా ముందుకు రాని విత్తన కంపెనీలను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేని విత్తనాలను సాగు చేస్తే పెట్టుబడితో పాటు ఒక సంవత్సరం పాటు ఆ రైతు కుటుంబం పోషణకు అవసరమైన ఆదా యం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. బయట మార్కెట్‌లో సర్టిఫైడ్ సీడ్ మాత్రమే అమ్మేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాణ్యత లేని విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్ముతున్న వారిపై విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు సబ్సిడీతో అందజేయాలని కోరా రు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.