
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ శనివారం వైభవంగా సాగింది. దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా విశేష సంఖ్యలో అమ్మవారి భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది కుటుంబ సమేతంగా హాజరయ్యారు. తెల్లవారుజామున 5.55 గంటలకు కామథేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
8 కిలో మీటర్ల మేర ప్రదక్షిణ..
ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, కోలాట నృత్యాల మధ్య గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, విద్యాధరపురం, సితార, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్‌రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. సుమారు 8 కిలో మీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తుల మనోభీష్టి నెరవేరుతుందని, అమ్మవారి కరుణా కటాక్షాలతో కుటుంబం సుఖ సంతోషాలతో విరసిల్లుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. భక్తులు పసుపు నీళ్లుతో గిరి ప్రదక్షిణ మార్గాన్ని శుద్ధి చేసి ఆది దంపతులకు భక్తితో పూజా ద్రవ్యాలను సమర్పించారు. గిరి ప్రదక్షిణ మార్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గిరి ప్రదక్షిణ పూర్తయిన అనంతరం భక్తులు కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ