
చిన్న ఆస్పత్రులను యాక్ట్ నుంచి మినహాయించాలి
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం నుంచి మినహాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.నందకిషోర్ అన్నారు. రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో కొన్ని సవరణలు తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలోని ఐఎంఏ హాలులో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎంఏ కోరిక మేరకు చాలా రాష్ట్రాల్లో క్లినిక్స్, చిన్న, మధ్యతరహా ఆస్పత్రులు అంటే 50 పడకల లోపు ఉన్న వాటిని చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారని, మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వైద్యులపై దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రాష్ట్రంలో చట్టాల్లో సవరణలు చేయాలన్నారు. ప్రస్తుతం మూడేళ్ల శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని, ఆ చట్టాన్ని ఏడేళ్లకు పొడిగించడం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేయాలన్నారు. పీఎన్‌డీటీ యాక్ట్‌లో గర్భిణులను టాగింగ్ చేయడం ద్వారా ప్రతి మాతా శిశువుని సంరక్షించవచ్చునన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎం.సుభాష్‌చంద్రబోస్, జాతీయ యాక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.ఫణిదర్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.