
డామిట్...కథ అడ్డం తిరిగింది!
కోడి పందేలకు భారీ బరి... రాత్రీ తెల్లవార్లూ ఉంటుందని ప్రచారం ●గుట్టు చప్పుడు కాకుండా ఆడించేందుకు సిద్ధం ●వారిలో వారికే మనస్పర్థలు రావడంతో సోషల్ మీడియాలో ప్రచారం ●మచిలీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో అర్థరాత్రి దాడులు ●తొమ్మిది మంది అరెస్ట్...ఒకరు పరారు...రూ.36,650 నగదు స్వాధీనం ●తొమ్మిది సెల్ ఫోన్లు... ఆరు ద్విచక్రవాహనాలు సీజ్
పెడన: మండల పరిధిలోని బలిపర్రు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఎన్డీయే కూటమికి చెందిన కొందరు నాయకులు భారీ బరిని ఏర్పాటు చేసి కోడి పందేలను నిర్వహించడానికి అంతా సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆడిస్తామని, ఆసక్తి ఉన్న వారు హాజరుకావాలంటూ లోపాయికారీగా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. దీంతో భారీ సంఖ్యలో ఔత్సాహికులు వాహనాలలో తరలివచ్చారు. దండిగా సొమ్ము చేసుకునే అవకాశం వచ్చిందని నిర్వాహకులు కూడా సంతోషపడ్డారు. అయితే వారిలో వాటాల పంపకం విషయంలో మనస్పర్థలు రావడంతో కోడిపందేల బరిని కాస్తా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం జిల్లా ఎస్పీ వరకు చేరడంతో ఆయన ఆదేశాలతో మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా ఆదివారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పెడన పోలీస్ స్టేషన్ ఎస్‌ఐతో ఇతర సిబ్బంది సైతం వివిధ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహణలో ఉండటంతో స్వయంగా డీఎస్పీ కోడిపందేల శిబిరంపై దాడి చేశారు.
తొమ్మిది మంది అరెస్ట్...రూ.36,650 నగదు స్వాధీనం
డీఎస్పీ రాజా తన సిబ్బందితో శిబిరంపై దాడి చేయగా తొమ్మిది మంది దొరికారు. ఒకరు పరారయ్యారు. వారి నుంచి రూ.36,650 నగదును స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది సెల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు పెడన ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. అయితే శిబిరం వద్ద ఫ్లడ్ లైట్లు, కుర్చీలు అలాగే వదిలివేశారు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటే వాటిని ఎవరు బుక్ చేశారనే విషయాలు బయటకు వచ్చేవని ప్రజలు అంటున్నారు.

డామిట్...కథ అడ్డం తిరిగింది!