పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిజాలు నిగ్గుతేల్చండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): పాస్టర్ ప్రవీణ్ పడగాల మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరమ్ అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్‌లో సోమవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన క్రైస్తవ సంఘాల మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కరుణాకర్ దాస్ మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాల మృతి ఘోర పరిణామం అన్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో విభిన్న చిత్రాలు వెళ్లడవుతున్నాయని, పోలీసులు చెప్పిన చిత్రాల్లో ముఖం సరిగా కనిపించడం లేదన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఇప్పటి వరకూ రాలేదని, పంచనామా క్లియర్‌గా లేదని, డాక్టర్ల నుంచి సరైన సమాచారం లేదని, ఇవి అనుమానాలకు తావిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు క్రైస్తవులు తమని తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. అందుకోసం పాస్టర్‌లు, మతపెద్దలు అందరూ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశమైనట్లు తెలిపారు. క్రైస్తవులపై ఎవరైనా దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలన్నారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత బిషప్ పి.స్పర్జన్ రాజు, పాస్టర్ వేశపోగు జాన్ భాస్కరరావు, సింపని గాస్పల్ అధినేత ఏఆర్ స్టీఫెన్ సన్, సువార్త చానల్ అధినేత చాట్ల లూథర్ ప్రశాంత్, పాస్టర్లు ఎం.రవికుమార్, ఎం. మ్యాథ్యూస్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్ దాస్


