రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కదులుతున్న రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాంబే కాలనీ రైల్వే ట్రాక్ పక్కన మగ వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, ఒంటిపై వంకాయ రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, నీలం రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీకి విజయవాడ జీఆర్పీ పోలీస్ స్టేషన్ లేదా 94406 27544 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ..
ఉంగుటూరు: బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి జారిపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద అవుటపల్లి గ్రామానికి చెందిన అవుటపల్లి ఏసుబాబు(29) రెండు రోజుల క్రితం బస్సు ఎక్కి విజయవాడ వెళ్తున్నాడు. పెద్ద అవుటపల్లి సెంటర్‌లో సర్వీస్ రోడ్డు నుంచి హైవే పైకి బస్సు మలుపు తిరుగుతుంది. అదే సమయంలో ఫుట్‌బోర్డుపై నిల్చున్న ఏసుబాబు ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలో చికిత్స పొందుతున్న ఏసుబాబు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో ఏఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అవివాహితుడు, దివ్యాంగుడు. గన్నవరం బస్‌స్టాండ్ వద్ద ఆటోలకు సర్వీసింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు.


