జగ్గయ్యపేట: పట్టణంలోని తొర్రకుంటపాలెంలోని సాయితిరుమల కోల్డ్‌స్టోరేజీలో మంగళవారం అర్ధ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే కోల్డ్‌స్టోరేజీ భవనం గురువారం నేలమట్టమైంది. నాలుగు రోజులుగా స్టోరేజీలోని మిర్చి బస్తాలు, అపరాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌ల ద్వారా మంటలను ఆర్పుతున్నారు. భవనం పూర్తిగా నేలమట్టమైనప్పటికీ లోపలున్న మిర్చి పూర్తిగా కాలిపోలేదని శుక్రవారం నాటికి మంటలు అదుపులోకి వస్తాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. భవనం కుప్పకూలడంతో యంత్రాల ద్వారా మిర్చిని పక్కకు తీసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.
కనిపించని అధికారులు
మూడు రోజులుగా కోల్డ్‌స్టోరేజీలో రైలులు నిల్వచేసిన రూ.కోట్ల విలువైన మిర్చి బుగ్గిపాలైనప్పటికీ సంబంధిత అధికారులు కనిపించడం లేదు. పంట నిల్వలు చేసిన రైతులు స్టోరేజీ వద్దకు వచ్చి కన్నీటిపర్యంతమవుతున్నారు. మక్కపేటకు చెందిన రైతు మాట్లాడుతూ.. కోల్డ్ స్టోరేజీలో మినుము పంటను నిల్వచేశానని, ఇప్పుడు తన పరిస్థితి ఏమిటని అగ్నిమాపక సిబ్బంది వద్ద వాపోయాడు.
హోం మంత్రికి బాధిత రైతుల ఆవేదన
పట్టణంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి గురువారం వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనితను కలిసేందుకు కోల్డ్‌స్టోరేజీ బాధితులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అగ్నిప్రమాదంలో సుమారు 350 మంది రైతులకు చెందిన 35 వేల మిర్చి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయని, తమను ఆదుకోవాలని నియోజకవర్గంలోని ఇందుగపల్లి, భీమవరం, మక్కపేట, రామచంద్రునిపేట గ్రామా లకు చెందిన రైతులు కోల్డ్‌స్టోరేజీ ఇచ్చిన రశీదులు తీసుకొచ్చి నినాదాలు చేశారు. రెండు రోజులవుతున్నా పాలకులు పట్టించుకోవటం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు చేసిన తప్పునకు తాము బలవ్వాలా అని నినాదాలు చేశారు. హోంమంత్రి తమ గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత హోంమంత్రిని కలిసేందుకు ఇద్దరు రైతులకు అనుమతిచ్చారు. వారు రైతుల పరిస్థితిని వివరించగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హోం మంత్రి అనిత బదులిచ్చారు.
మూడు రోజులుగా ఆరని మంటలు శుక్రవారం నాటికి మంటలుఅదుపులోకి వస్తాయన్న ఫైర్ సిబ్బంది
కోల్డ్ స్టోరేజీ భవనం నేలమట్టం