గూడూరు: పెడన సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలం లేళ్లగరువు పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాయపురెడ్డి శ్రీనివాసరావు(57) దుర్మరణం చెందారు. పెడన పల్లోటీ పాఠశాల సమీపంలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్లి తిరిగి ద్విచక్రవహనంపై ఇంటికి వస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొనడంతో శ్రీనివాసరావు వాహనంతో పాటు పడిపోయారు. ఆ సమయంలో తలకు బలమైన గాయమవ్వడంతో తీవ్ర రక్తస్రావమైంది. హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాసరావు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లేళ్లగరువు పీఏసీఎస్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2006లో ఆయన సతీమణి రాయపురెడ్డి శ్రీలక్ష్మి గ్రామ సర్పంచిగా పనిచేశారు. శ్రీనివాసరావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెడన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.