
మచిలీపట్నంటౌన్:సమాజంలోని పేదల్ని ఆదుకునేందుకు ఆర్యవైశ్యులు ఎల్లప్పుడు ముందుంటారని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అన్నారు. స్థానిక గోల్డ్ కన్వెన్షన్ కల్యాణ మండపంలో ఆదివారం కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం, అనుబంధ మహిళా విభాగ్, విభజన విభాగ్, వాసవీ సేవాదళ్ కృష్ణా జిల్లా నూతన కమిటీల ప్రతినిధుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ మచిలీపట్నం ఆర్యవైశ్యులు అనగానే గుడివాడ గున్నయ్యశెట్టి గుర్తుకొస్తారని తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందంజలో ఉంటారని చెప్పారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆశీర్వచనాలు ఎప్పుడూ తమకు ఉండాలని కోరారు. ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ సంఘాల నూతన పాలకవర్గాలు సేవా కార్యక్రమాలు మరిన్ని చేసి రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్ శీలం భారతి, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్‌దాదా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీకాకోళపు రేణుకారాణి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వేముల కృష్ణ, కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మద్దుల గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): టీడీపీ కూటమి ప్రతిష్టాత్మకంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన బహిరంగ సభకు ఎన్టీఆర్ జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు డుమ్మా కొట్టారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన తరువాత నిర్వహించిన తొలి బహిరంగ సభకు పూర్తిగా దూరంగా ఉన్నారు. విజయవాడ పశ్చిమ, పెడన నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయాలని భావించారు. అయితే ఆ సీట్లలో ఇతర అభ్యర్థుల నియామకం జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీకి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. విజయవాడ పశ్చిమ, పెడన నియోజకవర్గాలకు చెందిన జనసేన కార్యకర్తలు సభకు హాజరుకాకుండా తమ నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలికే బృందంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీచేయాలని ఆశించిన పోతిన మహేష్‌ను సభ్యుడిగా పార్టీ నియమించడంతో ఆయన అక్కడకు వెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రం వెళ్లలేదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.