
మైలవరం: ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ అటవీ శాఖాధికారి ఏసీబీకి చిక్కిన ఘటన బుధవారం మైలవరంలో చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన రైతు గండిపూడి రాంబాబు అటవీ ప్రాంతం నుంచి కలప రవాణా చేసుకోవడానికి అనుమతి కోసం అటవీ శాఖ మైలవరం డివిజన్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎ.రామకృష్ణను సంప్రదించాడు. రామకృష్ణ తన సన్నిహితుని ద్వారా రాంబాబును లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో రైతు రాంబాబు వద్ద నుంచి రామకృష్ణ బుధవారం రూ.23 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నామని ఏసీబీ అడిషనల్ ఎస్పీ పి.స్నేహిత తెలిపారు. మైలవరం ఫారెస్ట్ కార్యాలయం దగ్గర్లో రామకృష్ణ ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఆ గదిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి రూ.1.19 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడిలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.