
క్షయ అవగాహన ర్యాలీలో కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ భాగ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సుహాసిని
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్షయ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి, 2025 నాటికి క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. పాత ప్రభుత్వాస్పత్రి వద్ద నిర్వహించిన ఈ ర్యాలీని కలెక్టర్ ఢిల్లీరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి నుంచి 21 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ క్షయ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరం అన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, జిల్లా టీబీ అధికారి డాక్టర్ జూపూడి ఉషారాణి, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం, జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం అందజేత
క్షయ వాధి నివారణలో భాగంగా స్వచ్ఛంద సంస్థల భాగస్వామంతో పలువురు రోగులకు నెలకు రూ.700 విలువ చేసే పౌష్టికాహారాన్ని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చేతుల మీదగా అందజేశారు. వారికి ఆరు నెలల పాటు పౌష్టికాహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.