
విజయవాడ లబ్బీపేట సమీపంలోని మసీదులో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ శుక్రవారం ప్రారంభమైంది. గురువారం రాత్రి నెలపొడుపు కనిపించడంతో మతపెద్దలు రంజాన్ మాసం ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో గురువారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ మాసానికి ముస్లింలు స్వాగతం పలికారు.
మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని మసీదు ప్రాంగణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వన్‌టౌన్‌లోని సరాయి మసీదు, జుమ్మా మసీదు, వించిపేటలోని షాహీ మసీదుతో పాటుగా ఇస్లాంపేట బీఆర్పీ రోడ్డులోని మసీదులు, తారాపేటలోని మసీదుల్లో ఆయా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని సరాయి మసీదులో రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇందాద్‌ఘర్ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక నమాజ్‌లతో పాటుగా ఇఫ్తార్ విందు స్వీకరించేందుకు అనువుగా ఆయా ప్రాంగణాల్లో అదనపు వసతులను ఏర్పాటు చేశారు.
రద్దీగా దర్శనమిచ్చిన మసీదు ప్రాంగణాలు
రంజాన్ తొలి రోజు సాయంత్రం రోజా దీక్షలను ముగించేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల్లోని మసీదులకు చేరుకున్నారు. ప్రత్యేక నమాజ్‌ల్లో పాల్గొని ఉపవాస దీక్షలను విరమించారు. అక్కడే ఇఫ్తార్ విందుల్లో పాల్గొన్నారు. అందరూ సామూహిక ఇఫ్తార్‌లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయా మసీదు ప్రాంగణాలన్ని రద్దీగా దర్శనమిచ్చాయి. నగరంలోని ఆయా ప్రాంతాల్లోని మసీదులన్నీ విద్యుద్దీపాలతో కళకళలాడాయి. పలు ప్రాంతాల్లో ఇస్లాం సూక్తులను వివరించే నమూనాలను కూడా ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించి ఏర్పాటు చేశారు.
రోజాలో పాల్గొన్న ముస్లింలు కళకళలాడుతున్న మసీదులు ప్రత్యేక విద్యుద్దీపాలతో కనువిందు చేస్తున్న వన్‌టౌన్ పరిసరాలు