
సమావేశంలో రైతులతో మాట్లాడుతున్న జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్
ఎన్టీఆర్ జిల్లా జేసీ శ్రీవాస్ నుపూర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ–ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణలో రైతులకు నష్టం లేకుండా పరిహారం చెల్లిస్తామని ఎన్టీఆర్ జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్ అన్నారు. విజయవాడ–ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణకు సంబంధించి శుక్రవారం విజయవాడ రూరల్ పైడూరుపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆమె రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతుల నుంచి భూమికి సంబంధించిన అంగీకార పత్రాలను స్వీకరించారు. రహదారి విస్తరణలో సేకరించిన భూములలో రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా నిబంధనల మేరకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో భూ సేకరణ విభాగ సూపరింటెండెంట్ సీహెచ్ దుర్గాప్రసాద్, విజయవాడ రూరల్ తహసీల్దార్ పీ జాహ్నవి, డిప్టూయీ తహశీల్దార్ ఏ. రాజేష్ పాల్గొన్నారు.