
పెనమలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం.
పెనమలూరు: స్థానిక గ్రామ పంచాయతీలో నిధులు గోల్‌మాల్‌పై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని డీపీవో నియమించారు. గుడివాడ డీఎల్‌పీవో సంపత్‌కుమారితో పాటు ఇతర కమిటీ సభ్యులు ఈ నెల 29వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణ చేయనున్నారు.
ఏం జరిగిందంటే..
పెనమలూరు గ్రామ పంచాయతీలో బిల్లు కలెక్టర్‌గా పనిచేసిన షేక్ షుంషుద్దీన్ ఇంటి పన్నులు రూ. 41,69,053, నీటి పన్నులు రూ. 5,34,900 కలిపి మొత్తం రూ. 47,03,953 వసూలు చేశారు. ఈ సొమ్మును ట్రెజరీలో జమ చేయకుండా షేక్ షంషుద్దీన్ స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఎటువంటి రికార్డులు ఆయన అప్పగించలేదు. అయితే కొద్ది నెలల క్రితం షంషుద్దీన్ చోడవరం బదిలీ అయ్యారు. దీంతో పెనమలూరు గ్రామ పంచాయతీలో అన్ని రికార్డులు తనిఖీ చేయటానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. కమిటీలో పెనమలూరు ఈవోపీఆర్డీ కోరా శ్రీనివాసరావు, గరికపర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.శేషపూర్నేశ్వరి, కౌతవరం గ్రా మపంచాయతీ కార్యదర్శి సీహెచ్.ఉమామహేశ్వరరావు, పెదపూడి గ్రామ పంచాయతీ జూనియక్ అసిస్టెంట్ పి.గోపీకృష్ణ, కంకిపాడు గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ ఆర్.ప్రదీప్ చాంద్‌లను నియమించారు. వీరు రికార్డులు తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం షంషుద్దీన్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.