
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను సమర్థంగా పోషించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు సూచించారు. కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ జూపూడి ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసినిలతో కలిసి క్షయవ్యాధికార బ్యాక్టీరియాను గుర్తించిన డాక్టర్ రాబర్ట్ కాచ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యం మేరకు జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులకు సకాలంలో గుర్తించి చికిత్స అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,011 మంది క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స తీసుకుంటున్నారని, వ్యాధి తీవ్రత, నివసించే ప్రాంతం, వయస్సు, సీ్త్ర, పురుషుల వివరాలు, చిన్నారులు తదితర వివరాలను నమోదు చేసి చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షయ వ్యాధి నియంత్రణలో జిల్లా అగ్రస్థానంలో ఉండటం పట్ల కలెక్టర్ ఢిల్లీరావు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో క్షయ వ్యాధి పరీక్షలలో విశేష సేవలందిస్తున్న పలు పరీక్ష కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందికి కలెక్టర్ ఢిల్లీరావు జ్ఞాపికలను ప్రశంస పత్రాలను అందజేశారు. సమావేశంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి. సమరం, డీఐవో డా. అమృత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.