
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పులు కుప్పగా పెరిగాయి. తీసుకున్న అసలు చెల్లించినా వడ్డీ, ఆపై చక్రవడ్డీ చెల్లించాలంటూ వేధింపులు. అప్పులు తీర్చే మార్గం లేక... వేధింపులు భరించలేక కన్నతల్లితో సహా ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా తల్లి మృతి అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న గొల్లపూడి గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు, మృతుని సోదరుడు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
గొల్లపూడి వన్ సెంటర్ పోస్టాఫీసు రోడ్డులోని హిమాగ్న హోమ్స్ నందు ఫ్లాట్ నంబర్ 204లో కొత్తమాసు ఫణీంద్ర (36) తన తల్లి కొత్తమాసు రాజేశ్వరి (55), భార్య కొత్తమాసు వెంకట సాయి మోహన సుధతో (28) కలిసి నివాసం ఉంటున్నాడు. ఫణీంద్ర మా డిజైన్ పేరుతో ఇంటర్ నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. దీనికి తోడు ఇతరుల నుంచి డబ్బులు తీసుకుని రొటేషన్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఇతను తన మేనమామతో పాటు ఇతరుల వద్ద అప్పులు, బ్యాంకు లోన్లు తీసుకున్నాడు. సొంత మేనమామ జాలురు సుబ్బారావు వద్ద తీసుకున్న రూ.10 లక్షల అప్పునకు, నెలకు రూ.10 వేల వడ్డీ చెల్లిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు దీనిని చెల్లిస్తూ వచ్చాడు.
ఫణీంద్ర ఇంట్లో సూసైడ్ నోట్..
నాగఫణీంద్ర సోదరుడు ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఉదయం ఫణీంద్రకు ఫోన్ చేశాడు. ఫణీంద్ర, అతని భార్య, తల్లి ఇంట్లో ఏ ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రవీణ్ గొల్లపూడిలోని ఫణీంద్ర ఇంటికి వచ్చి చూశాడు. ఇంటి తలుపులు కొట్టినా తీయకపోవడంతో వాచ్‌మన్ సహాయంతో తలుపులు పగుల గొట్టి లోపలికి ప్రవేశించాడు. నాగఫణీంద్ర, అతని భార్య సుధ వంట గదిలోని సీలింగ్ ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. తల్లి రాజేశ్వరి బెడ్ రూంలో వెల్లకిలా పడి ఉంది. ఆ పక్కనే ఉన్న కంప్యూటర్ టేబుల్‌పై సూసైడ్ నోట్ పెట్టి ఉంది. సూసైడ్ నోట్‌లో తమ మరణానికి మేనమామ జాలురు సుబ్బారావు, అతని భార్య భారతి, అతని కుమారుడు మణికంఠ, కుమార్తె స్రవంతి కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
కాగా నాగ ఫణీంద్ర తల్లి రాజేశ్వరి మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజేశ్వరి బెడ్‌రూంలో మంచంపై పడి ఉంది. ఆమె ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి గడ్డం కింద ముడి వేసి ఉంది. ఫణీంద్ర దంపతులు ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తల్లిని చంపేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కన్న తల్లి, కళ్ల ముందే చనిపోయిన తరువాత కొడుకు, కోడలు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రాజేశ్వరి మరణంపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment