టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా వనితా డే

Telangana Development Forum Vanita Day Celebrations - Sakshi

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో 2022 మార్చి 12న అట్లాంటాలో వనితా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమం ఆద్యాంతం వినోదాత్మకంగా సాగింది. వనితా వేదిక విజయవంతం కావడానికి అందరి తోడ్పాటు ఆశీస్సులే కారణమని టీడీఎఫ్‌ అట్లాంటా 2022 అధ్యక్షురాలు స్వప్న కస్వా అన్నారు. రాబోయే రోజుల్లో  మరెన్నో అద్భుత కార్యక్రమాలను చేపడతామని ఆమె తెలియజేశారు. 

కేవలం మహిళలకే పరిమితమైన ఈ వేడుకల్లో రికార్డు స్థాయిలో సుమారు 600 పాల్గొన్నారు. ​కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు ఎంతో వైభవంగా ఉల్లాసంగా కొనసాగింది.  ఆటపాటలు, స్ఫూర్తిదాయక ప్రసంగాలు, ఫ్యాషన్ షో, టాక్‌షో, పాటల పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల పాటలు, ముద్దుగుమ్మల మాటలు , పడుచుల ఆటలతో వేడుక సంబరాల పందిరైంది. అట్లాంటా తెలుగు వారికి సుపరిచితురాలు లావణ్య గూడూరు ఉల్లాసభరిత యాంకరింగ్‌తో ఈ కార్యక్రమానికి మరింత సందడిగా మారింది.

అంతకు ముందు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వప్న కస్వా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2022 వనితా వేడుకల ముఖ్య  ఉద్దేశం  స్త్రీ సశక్తీకరణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు హాజరయ్యారు. వీరిలో ప్రీతి మునగపాటి, డాక్టర్‌ నందిని సుంకిరెడ్డి, డాక్టర్‌। నీలిమ దాచూరిలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. 

తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పలు సంస్థల మహిళా బోర్డు మెంబర్లకు  తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం అభినందించింది. అందులో భాగంగా టీడీఎఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బాపు రెడ్డి కేతిరెడ్డి, సంయుక్త కార్యదర్శి స్వాతి సుదిని, ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈఐఎస్‌ టెక్నాలజీస్‌, రాపిడిట్‌, ఆర్‌పైన్‌, జీవీఆర్‌ అండ్‌ ఒర్డుసియన్‌లు ఈ కార్యక్రమం నిర్వహించడంలో టీడీఎఫ్‌కు తమ వంతు సహకారం అందించాయి.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top