ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం..
చైతన్యం ఇలాగే కొనసాగాలి
మార్పు మొదలైంది... పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యాన్ని కాపాడు కునేందుకు ప్రజలు ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పి, స్టీల్ వైపు అడుగులు వేస్తున్నారు. శుభకార్యాలు, విందు వినోదాల సమయంలో విచ్చలవిడిగా వాడే ప్లాస్టిక్ విస్తార్లు, గ్లాసుల స్థానంలోకి మళ్లీ సంప్రదాయ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వచ్చి చేరుతున్నాయి. పల్లెల నుంచే మార్పు దిశగా అడుగులు పడుతుండడం శుభపరిణామమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు.
స్టీల్ ప్లేట్లలో భోజనం చేస్తున్న డొంకేశ్వర్ గ్రామస్తులు
మోర్తాడ్/డొంకేశ్వర్: ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే దిశగా పల్లెలు అడుగులు వేస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. పర్యావరణ ప్రేమికులూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు, విందులు కొనసాగే చోట్ల ప్లాస్టిక్‌తో తయారు చేసిన ప్లేట్లు, గ్లాసులు కనిపించేవి. ప్రస్తుతం కొన్ని చోట్ల అవి కనుమరుగవుతుండడం విశేషం. స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌లను క్రమంగా వినియోగంలోకి తీసుకువస్తున్నారు.
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని పాటి హనుమాన్ మందిరం భక్తుల ఆధ్వర్యంలో దాతల నుంచి 2వేల వరకు స్టీల్ ప్లేట్లను సేకరించారు. కమ్మర్‌పల్లిలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా, అన్నదానాలు నిర్వహించినా ఈ స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌లను వినియోగిస్తున్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ప్లాస్టిక్‌పై నిషేధం తీర్మానం చేయగా గౌడ సంఘం పెద్ద మనుషులు స్పందించారు. రేణుకాఎల్లమ్మ ఉత్సవాల సందర్భంగా అన్నదానం నిర్వహించగా స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌లను కొనుగోలు చేసి వాటినే వినియోగించారు. చౌట్‌పల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, శ్రీలక్ష్మి నారాయణ స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ పల్లాలను, గ్లాసులను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. ఎవరు శుభకార్యాలను నిర్వహించినా భోజనాల కోసం ఉచితంగానే పల్లాలు, గ్లాసులను సరఫరా చేయనున్నారు. మోర్తాడ్, ఏర్గట్ల, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో స్టీల్ సామగ్రి వాడకాన్ని ప్రోత్సహించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.
ప్లాస్టిక్ కారణంగా తలెత్తే అనార్థాలపై నందిపేటలోని పలుగుట్ట వ్యవస్థాకులు కేదారానంద మహారాజ్ ఇటీవల జిల్లాలో నిర్వహించిన హిందూ సమ్మేళనాల్లో అవగాహన కల్పించారు. అలాగే ఆశ్రమం నుంచి శుభకార్యాలు, పెళ్లిళ్లకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేసి తిరిగి తీసుకుంటున్నారు. మండలంలోని నూత్‌పల్లి గ్రామ పంచాయతీ ఇటీవల ప్లాస్టిక్‌ను నిషేధించింది. 600 స్టీల్ ప్లేట్లు, 400 గ్లాసులను కొనుగోలు చేసి ఊరి ప్రజలు ఉచితంగా వినియోగించుకునేందుఉ జీపీలో అందుబాటులో ఉంచింది.
వీలైనంత తొందరలోనే అన్ని గ్రామాలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
ఇటీవల నృసింహస్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కమ్మర్‌పల్లి, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌లను వినియోగించారు. డొంకేశ్వర్‌లోని ఆలయానికి బార్ల శ్యామ్‌రెడ్డి, నాగరాజ్‌రెడ్డి, నవీన్‌రెడ్డిలు కలిసి 200 స్టీల్ ప్లేట్లు, 200గ్లాసులు కొనుగోలు చేసి ఇచ్చారు.
కమ్మర్‌పల్లి హనుమాన్ మందిరంలో స్టీల్ ప్లేట్లు
ప్లాస్టిక్ వినియోగానికి క్రమంగా
దూరమవుతున్న పల్లెలు
పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య
సంరక్షణ దిశగా అడుగులు
అన్నదానాలు, ఫంక్షన్‌లలో స్టీల్ ప్లేట్లు, గ్లాస్‌ల వినియోగం
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పర్యావరణ ప్రేమికులు
కమ్మర్‌పల్లిని ప్లాస్టిక్ ర హిత గ్రామంగా తీర్చిది ద్దుతాం. ఇందుకోసం గ్రామాభివృద్ధి కమిటీ కృతనిశ్చయంతో ఉంది. ఇక్కడ ఉన్న స్టీల్ బ్యాంకును చూసి అనేక గ్రా మాలలో స్టీల్ పల్లాలు, గ్లాస్‌లను కొనుగోలు చే యడం సంతోషంగా ఉంది. అన్ని గ్రామాల్లో మార్పు రావాలి. – మైలారం సుధాకర్,
కమ్మర్‌పల్లి వీడీసీ సభ్యుడు
ప్రజలు ప్లాస్టిక్‌ను తగ్గించి స్టీల్ వస్తువులను ఉపయోగించడం మంచి ప రిణామం. నేడు మనం వాడే ఒక్క స్టీల్ ప్లేట్, గ్లాసు రేపటి తరాన్ని వేల ప్లాస్టిక్ వ్యర్థాలనుంచి కాపాడుతాయి. వచ్చిన చైతన్యం ఇలాగే కొనసా గితే భవిష్యత్‌లో పర్యావరణ ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉండవు. – గున్నాల నరేశ్,
పూజారి, డొంకేశ్వర్


