మోర్తాడ్/డొంకేశ్వర్: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాల వడ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సన్న రకాలను మాత్రమే సేకరిస్తూ దొడ్దు రకం ధాన్యాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత కోసిన పంట కల్లాల్లో పోసి రెండు, మూడు వారాలవుతున్నా తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము కల్లాల్లోనే రోజులు గడుపుతున్నామని వాపోతున్నారు. వర్షం కురిస్తే ధాన్యం తడిసిపోతుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులను అడిగినా ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఇటీవల జిల్లాలో సిరికొండ, ఇందల్వాయి, మాక్లూర్ ఇతర ప్రాంతాల్లో రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేశారు.
దొడ్డు రకాలను విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. దొడ్డు రకాలకు ఏ గ్రేడ్ ధరనే వర్తింప చేస్తుండటంతో కచ్చితంగా అన్‌లోడింగ్ చేసుకోవాలని కలెక్టర్, జిల్లా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు రైస్‌మిల్లర్లను ఆదేశించినా ప్రయోజనం లేకపోయింది. గతంలో కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు అలాగే ఉన్నాయని దొడ్డు రకాలను ఇప్పుడు తీసుకుంటే నిలువ చేసుకునే పరిస్థితి లేదని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. మోర్తాడ్ కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొండ, భీమ్‌గల్ మండలాల్లో దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. లోడింగ్‌కు వస్తామని ముందు ఒప్పుకుంటున్న లారీల డ్రైవర్లు.. దొడ్డు రకం అనగానే ఫోన్ కట్ చేసి మళ్లీ లిఫ్ట్ చేయడం లేదని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. దొడ్డు రకాలను మిల్లులకు తరలిస్తే అక్కడ అన్‌లోడింగ్ చేసుకోకుండా రోజుల తరబడి నిలపి ఉంచుతుండటంతో తమ లారీలకు గిరాకీ లేకుండా పోతుందని యజమానులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజనులో 1.71లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 30 శాతం కూడా సేకరించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలను మిల్లరు పెడచెవిన పెడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని రైతులు వాపోతున్నారు.
అన్‌లోడింగ్‌కు రైస్‌మిల్లర్ల విముఖత
కొనుగోలు కేంద్రాల్లో
తూకం వేయని అధికారులు
అధికారుల ఆదేశాలు బేఖాతర్
ఆందోళనలో అన్నదాతలు


