● బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు
ఇందూరు పునాది కావాలి
● మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా ఇన్‌చార్జి
శానంపూడి సైదిరెడ్డి
సుభాష్‌నగర్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కరప్షన్, కమీషన్ల పార్టీ అని హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌చార్జి శానంపూడి సైదిరెడ్డి ఆరోపించారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని శనివారం రాత్రి నగరంలోని కోటగల్లిలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన సైదిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండున్నరేళ్లలో కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కాంట్రాక్టర్లు పనులు చేయడానికి భయపడుతున్నారని విమర్శించారు. పనులు చేసిన వారి నుంచి 30శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీకి మహిళలంటే ప్రత్యే క గౌరవం ఉంటుందని, వారికి అధికారం అప్పజెబితే దేశం బాగుపడుతుందని బలంగా విశ్వసిస్తార ని పేర్కొన్నారు. అందుకే బీజేపీ మహిళా బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వకుండా వీగిపోయేలా చేశాయన్నారు. ఇందూరు బీజేపీకి ప్రతి ఎన్నికల్లో అండగా నిలబడుతుందని, ఇక్కడ మొదలు పెట్టిన జైత్రయాత్ర రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేవరకూ కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఇందూరులో వేసిన పునాదితోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
మోసం కాంగ్రెస్ నైజం
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మహిళలను మోసం చేస్తూనే ఉందని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలతోపాటు అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేయడానికి ఈనెల 10వ తేదీన ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని, సభకు మహిళలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


