మోపాల్: నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేంద్రకుమార్ సూచించారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామపంచాయతీలో జల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి వినియోగంపై గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఫ్లకార్డులతో అవగాహన కల్పించారు. అనంతరం ఎస్‌ఈ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రభుత్వం ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తోందని అన్నారు. నల్లాలు లేని రోజుల్లో మహిళలు నీటి కోసం బిందెలు పట్టుకుని బోరుబావుల వద్దకు వెళ్లే వారని, ఈ స్కీమ్‌ను మహిళల కోసమే ప్రవేశపెట్టారని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మిషన్ భగీరథ నీటిని పూర్తిగా క్లోరినేషన్, బ్లీచింగ్ చేసిన తర్వాతే సరఫరా చేస్తున్నామని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఆ నీటిని తాగడానికి వినియోగించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవిలో నీటిని వృథా చేయొద్దని, గ్రామంలో వందశాతం మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సర్పంచ్ సుమలతను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇంట్రా, గ్రిడ్ ఈఈలు రాకేశ్, నరేశ్, ఎంపీడీవో రాములు నాయక్, డీఈలు వెంకటేశ్వర్ గౌడ్, శివ, ఏఈ వినయ్‌రెడ్డి, ఎంపీవో కిరణ్‌కుమార్, ఉపసర్పంచ్ దుర్గయ్య, జీపీ కార్యదర్శి నర్సింహులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


