● ముగ్గురు చిన్నారుల హత్య కేసులో..
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి
కామారెడ్డి క్రైం: కడుపున పుట్టిన ముగ్గురు కుమార్తెలను చెరువులో తోసేసి దారుణంగా హత్య చేసిన కసాయి తండ్రిని కామారెడ్డి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అప్పుల బాధలు, పోషించలేకనే అతడు తన ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3.30 గంట ల ప్రాంతంలో ఆర్‌బీ నగర్ కాలనీకి చెందిన భార్యాభర్తలు షబీనీ, ఇస్మాయిల్‌లు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ ముగ్గురు కుమార్తెలు షీపత్(8), అయాత్(7), మరియం(5) కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. తన ఆటోలోనే పిల్లలను ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాలనీకి దగ్గర్‌లోని ఓ దుకాణానికి తీసుకువెళ్తానని చెప్పి తినుబండారాలు కొనిచ్చాడు. ఆ తర్వాత ఆటో గిరాకీ రావడంతో గల్లీ చివర్‌లో దింపేసి ఇంటికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోయానని ఇస్మాయిల్ పోలీసులతో చెప్పాడు. పోలీసులు వెంటనే 5 ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పిల్లల జాడ కోసం గాలించడం మొదలు పెట్టారు. పిల్లలను దింపిన చోటును చూపించే క్రమంలో ఇస్మాయిల్ తడబడుతూ అడిగిన ప్రతిసారి వేర్వేరు ప్రదేశాలను చూయించాడు. అంతేకాకుండా సీసీ ఫుటేజీల్లో ఇస్మాయిల్ పిల్లలను ఎక్కడా ఆటోలో నుంచి దింపినట్లు కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఇస్మాయిల్‌ను విచారించగా నేరం అంగీకరించాడని ఏఎస్పీ తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువులో రాత్రి 10 గంటల ప్రాంతంలో అయాత్, మరియం, దాదాపు 12 గంటల ప్రాంతంలో షీపత్ మృతదేహాలను కనుగొన్నామని వెల్లడించారు. నిందితుడు ఇస్మాయిల్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. అప్పుల బాధలు, పోషించే స్థోమత లేకపోవడంతోనే నిందితుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ, రూరల్ సీఐలు నరహరి, రామన్, సీసీఎస్ పోలీసులను అభినందించారు.


