బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించాలి

Mar 9 2026 7:14 AM | Updated on Mar 9 2026 7:14 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

జీజీహెచ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభం

సుభాష్‌నగర్‌ : గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ నిరోధానికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆదివారం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఎంతో ఉపయోగకరమైనదని, దీన్ని తీసుకోవడంతో 95 శాతం వరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను నిరోధించుకోవచ్చని అన్నారు. వ్యాక్సిన్‌ పట్ల అపోహలు అవసరం లేదని, ఆందోళనకు గురికాకుండా జిల్లాలోని 12,363 మంది బాలికలకు మిషన్‌ మోడ్‌లో వ్యాక్సిన్‌ వేయించాలని సూచించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్‌ క్యాన్సర్‌ను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్‌ను అందిస్తోందని తెలిపారు. జీజీహెచ్‌తోపాటు జిల్లాలోని డిచ్‌పల్లి, ధర్పల్లి, నవీపేట్‌, వర్ని, మోర్తాడ్‌, బాల్కొండ, ఆర్మూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కూడా వ్యాక్సిన్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు సర్టిఫికెట్‌ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తేనున్న హెల్త్‌ ప్రొఫైల్‌ కోసం ఈ సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో శారీరక బలహీనతతో కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అంతమాత్రాన భయపడకుండా పారాసిటమల్‌ టాబ్లెట్‌ వేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్‌ కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ అశోక్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ అశ్విని, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement