● రుణమే పెట్టుబడిగా
సొంత వ్యాపారాలు
● ఆదర్శంగా నిలుస్తున్న జిల్లాలోని
పలువురు ఎస్‌హెచ్‌జీ మహిళలు
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌కు చెందిన అనుగందుల అమిత కార్తికేయ మహిళా సంఘంలో సభ్యురాలు. డిగ్రీ వరకు చదివిన ఈమె 2014లో మోర్తాడ్ జెడ్పీటీసీగా కూడా పని చేశారు. ప్రజలను కల్తీ నూనె బారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో నాలుగేళ్ల క్రితం ఇంటి వద్ద సొంతగా ఆయిల్ మిల్లును ప్రారంభించారు. రూ.5 లక్షల రుణంతో యంత్రాన్ని కొనుగోలు చేసి స్వచ్ఛమైన నువ్వులు, పల్లి, కొబ్బరి, కుసుమ, ఇతర వంట నూనెలను పట్టి ఇస్తున్నారు. వ్యాపారంలో నిలదొక్కుకుని ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నూనె మిల్లుతోపాటు బీడీ కార్ఖానాలు కూడా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
చందూర్ మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి సవిత దివ్యశ్రీ మహిళా సంఘంలో సభ్యురాలు. కుమ్మరి వృత్తి కావడంతో బ్యాంకు లింకేజీ రుణాలను పొంది భర్తతో కలిసి కొన్నేళ్లుగా ఇంటి వద్దనే ఉంటూ మట్టి పాత్రల వ్యాపారం చేస్తున్నారు. అద్భుతమైన బొమ్మలు, టీ కప్పులు, వంట పాత్రలు, ఇతర వస్తువులు పూర్తిగా చెరువు మట్టితోనే తయారు చేస్తున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం అప్పుడప్పుడు కూడా మహిళ సంఘంలో రుణాలు పొందుతున్నారు. ప్రస్తుత కాలంలో మట్టి పాత్రలకు ప్రాధాన్యం పెరగడంతో వ్యాపారం బాగా నడుస్తోంది. రుణమే పెట్టుబడిగా మలిచి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడంతో సవితను పలువురు ప్రశంసిస్తున్నారు.
మోస్రా మండలం గోవూరుకు చెందిన జ్యోతిర్మయి ఇందిరా మహిళా సంఘంలో సభ్యురాలు. డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఈమె ఏడాది క్రితం గ్రామీణ ఉత్పత్తుల వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గానుగ నూనెను కూడా విక్రయిస్తున్నారు. నగరవాసుల ఆరోగ్యం కోసం చిరుధాన్యాలు, మిల్లెట్లు, పప్పు దినుసులు, మసాలాలు, ఔషధ పౌడర్‌లు, తైలాలు, చూర్ణాలను సొంతగా తయారు చేసి జిల్లా కేంద్రంలో గంగస్థాన్ వద్ద షాపును పెట్టి విక్రయిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.3.50లక్షల రుణం తీసుకొని వ్యాపారంలో నిలదొక్కుకుంటున్నారు.
మాక్లూర్ మండలం మాదాపూర్‌కు చెందిన కట్టాజి వైష్ణవి.. అంబికాదేవి మహిళా సంఘంలో సభ్యురాలు. ఇంటర్ వరకు చదివిన ఈ యువతి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ఇంట్లోనే సొంత బిజినెస్‌ను ప్రారంభించారు. ఇందుకు కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్, డిజైనర్‌గా ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నారు. గృహ అలంకరణ వస్తువుల తయారీ, పెయిటింగ్ వేయడంలోనూ ఆమె నిష్ణాతురాలు. అయితే, తనకున్న నైపుణ్యంతో బిజినెస్‌ను ఇంటికే పరిమితం చేయకూడదనే ఉద్దేశంతో మహిళా సంఘంలో రూ.2 లక్షల బ్యాంకు లింకేజీ రుణం పొందారు. ఆర్మూర్ పట్టణంలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె బిజినెస్ వివిధ గ్రామాలకు విస్తరించారు. ఆర్డర్లు తీసుకొని మరీ డిజైన్లు తయారు చేస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళల పేర్లు సునీత, రజిత, కమల, లావణ్య. వీరిది సిరికొండ మండలం న్యావనంది గ్రామం. చేపలు పట్టే వృత్తి కావడంతో గంగపుత్ర మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న వీరు గోదావరి స్వయం సహాయం సంఘంలో సభ్యులుగా ఉన్నారు. కలిసికట్టుగా ఏదైనా వ్యాపారం చేయాలని భావించి బ్యాంకు లింకేజీ రుణాలు పొందారు. ఆ డబ్బులతో ఏడాది క్రితం ఊరిలోనే చేపలు, రొయ్యలు, చికెన్, కూరగాయల పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆర్డర్లపై ఫిష్ ఫ్రై, పచ్చళ్లు చేసి అమ్ముతున్నారు. విదేశాలకు సైతం విక్రయిస్తున్నారు.
తనకంటూ సొంత సందపాదనతో ఇతరులకు ఆదర్శంగా నిలువాలనే పట్టుదలతో కాస్మోటాలజిస్టుగా రాణిస్తున్నారు ఆర్మూర్ పట్టణానికి చెందిన యువతి కొక్కుల శ్వేత. డిగ్రీ, బీఎడ్ చదివినప్పటికీ స్వయం శక్తితో ఎదగాలనే సంకల్పంతో బ్యాంకులో రూ.4 లక్షల రుణం తీసుకుని వీక్లి మార్కెట్‌లో అపారాజిత బ్యూటీ జోన్‌ను స్థాపించారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ఇంటర్నేషనల్ అకాడమీలో ప్రొఫెషనల్ కోర్సు చేసి సర్టిఫికెట్ పొందారు. బ్యూటీ జోన్‌లో మహిళలకు నాన్‌సర్జికల్ ట్రీట్‌మెంట్, కేశ సంరక్షణ, మేకప్ చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. యువతి నైపుణ్యానికి శుభకార్యాలు, పెళ్లిళ్లలో వధువుల మేకప్ కోసం ఆర్డర్లు క్యూ కడుతున్నాయి.
నేటి మహిళ అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహాన్ని, బ్యాంకు రుణాలను ఆసరాగా చేసుకుని సొంతగా వ్యాపారాలు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. జిల్లాలో స్వయం శక్తితో ఎదిగిన, ఎదుగుతున్న పలువురు ఎస్‌హెచ్‌జీ మహిళలు గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మినీ సరస్ మేళాలో వ్యాపార ఉత్పత్తులను, హస్త కళలను ప్రదర్శించి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం. – డొంకేశ్వర్(ఆర్మూర్)


