తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీతో పాటు వర్సిటీ పరిధిలోని ఇంటర్ కళాశాలల హ్యాండ్‌బాల్ (పురుషులు, మహిళలు) ఎంపిక పోటీలు శనివారం క్యాంపస్ క్రీడామైదానంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీలలో చక్కని ప్రతిభచూపి వర్సిటీ క్రీడా జట్టు సభ్యులుగా ఎంపిక కావాలని సూచించారు. వర్సిటీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ బాలకిషన్ మాట్లాడుతూ ఎంపికై న పురుషుల జట్టు ఈ నెల 15న తమిళనాడులోని వీఐటీ వెల్లూరులో జరిగే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొంటారని అన్నారు. మహిళల జట్టు ఈ నెల 17న కేరళలోని కొట్టాయం ఏంజీయూలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో పాల్గొంటుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపల్ గోపిశెట్టి రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీఆర్‌నేత, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్ రాము, రూప, అనిల్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ నరేశ్ జాదవ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


