నిజామాబాద్ రూరల్: తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందిన ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తకుంట గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ తెలిపిన వి వరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గమ్మగొని స్వామిగౌడ్ (55) శనివారం ఉదయం కెనాల్ కట్టకు ఆనుకొని ఉన్న తాటి చెట్టు పైనుండి కాలు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి కుమారుడు సతీశ్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నవీపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిటైర్డ్ టీచర్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన ట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. జన్నెపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ దొడ్డి శ్రీనివాసరావ్ (70), నిజాంపూర్ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం మురళీధర్ రావ్‌తో కలిసి ఈ నెల 5న నిజామాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా.. మరో బైక్‌పై ఫకీరాబాద్ వైపు వెళ్తున్న గంగాప్రసాద్ ఎదురెదురుగా ఢీకొన్నారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన రిటైర్డ్ టీచర్ శ్రీనివాసరావ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కామారెడ్డి క్రైం: కామారెడ్డిలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. గోసంగి కాలనీకి చెందిన అన్నా, చెల్లెలి పిల్లలు కోదండం సాంబయ్య కొడుకు విజయ్ (9), పానేటి శారద కొడుకు సింహాద్రి (10) స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరిద్దరూ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యలు చాలా చోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పిల్లల కోసం గాలిస్తున్నామని టౌన్ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు.
రామారెడ్డి (ఎల్లారెడ్డి): మండలంలోని ఓ గ్రామంలో వరుసకు బావ అయ్యే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఘటన చోటు చేసుకుంది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటికి పోక్కింది. ఈ విషయమై ఎస్సై రాజశేఖర్‌ను సాక్షి వివరణ కోరగా కేసు నమోదు చేసి విచారణ చేసున్నట్లుగా తెలిపారు.


