సుభాష్‌నగర్: జిల్లా ప్రజలపై గ్యాస్ సిలిండర్ భారం పడింది. గృహ వినియోగ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.114.50 ధర పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రతినెలా జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానున్నాయి. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులకు మహాలక్ష్మి పథకం కింద రూ.500 కూడా రావడంలేదు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొనడమే ధరలు పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.
పెరిగిన సిలిండర్ ధరలు
గృహ వినియోగంపై రూ.60..
కమర్షియల్‌పై రూ.114.50
జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం


