ఓటుకు 1లక్షా73వేల మంది దూరం
● రాష్ట్రంలోనే అతి తక్కువ పోలింగ్
నమోదుగా ఇందూరు
● మూడు విడతల్లో 78.04 శాతం
మాత్రమే పోలింగ్
ఆర్మూర్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఎంతో మంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే. అలాంటిది జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో పల్లె ఓటర్లు 1,73,099 (21.06 శాతం) మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 78.04 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్లెల్లో అడుగు వేయలేని దివ్యాంగులు, వృద్ధులు, రోగులు సైతం వ్యయ, ప్రయాసాలకోర్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఈ తీరును గమనిస్తే అసలైన కురు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోలేని వారే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో యాదాద్రి జిల్లాలో 92.56 శాతంతో అత్యధిక పోలింగ్ నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో మాత్రం 76.45 శాతంతో అత్యల్ప పోలింగ్ జరిగిన జిల్లాగా నిలవడమే ఇందుకు నిదర్శనం. జిల్లా యంత్రాంగం ఓటు హక్కును వినియోగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం.
6,15,257 మంది ఓటేశారు..
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 7,88,356 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 3,67,068, మహిళలు 4,21,270, ఇతరులు 18 మంది ఉన్నారు. మూడు విడతల్లో కలిపి మొత్తం 6,15,257 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 2,65,679 మంది కాగా మహిళలు 3,49,574 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. దీంతో మూడు విడతల్లో కలిపి 78.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషుల సంఖ్య కంటే 83,895 మంది మహిళ ఓటర్లే అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.


