కరపత్రాల ఆవిష్కరణ
సుభాష్‌నగర్: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఉత్సవాల కరపత్రాలను కలెక్టరేట్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జి నవిత, వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పుప్పాల విజయ్‌కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ ఉత్సవాలు ఈ నెల 18 నుంచి జనవరి 1 వరకు కొనసాగుతాయని అన్నారు. జిల్లాలోని వినియోగదారుల సంఘాలు, వివిధ శాఖల అధికారులు, తూనికలు కొలతలు, ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ, రోడ్డు రవాణా శాఖ, మార్కెటింగ్‌శాఖల ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా మొదటిసారి దేశవ్యాప్తంగా 24వ తేదీ నుంచి వినియోగదారుల భారత్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో వినియోగదారుల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇందల్వాయి: మండలంలోని డొంకల్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన జక్కుల లింగం, సంజీవరెడ్డి అనే యువకులు కారులో ఇందల్వాయి నుంచి డొంకల్ గ్రామానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.
రుద్రూర్: మండల కేంద్రంలో చైనా మంజా విక్రయిస్తే చర్యలు తప్పవని కోటగిరి ఎస్సై సునీల్ దుకాణదారులకు హెచ్చరించారు. పొతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం దుకాణదారులకు నోటీసులు అందజేశారు. సూచనలకు విరుద్ధంగా ఎవరైనా చైనా మంజాను విక్రయిస్తే చట్ట ప్రకార చర్యలు తీసుకుంటామన్నారు. చైనా మంజా వాడకం వల్ల జంతువులకు, వ్యక్తులకు ప్రాణహాని కలిగితే హత్య నేరం కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.


