క్రీడల్లో గెలుపోటములు సహజం
● రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్
తాహెర్ బిన్ హందాన్
సుభాష్‌నగర్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహపడొద్దని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. నగరంలోని నాగారంలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో జోష్–2025 పేరుతో మూడు రోజులపాటు నిర్వహించే క్రీడా పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ చేయగా ముఖ్యఅతిథులు గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు. అనంతరం తాహెర్ మాట్లాడుతూ.. మానసిక ఒత్తిళ్లను అధిగమిస్తూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులకు నిత్యం క్రీడల్లో శిక్షణనిస్తూ ప్రోత్సహించాలని పేర్కొన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక కార్యచరణ రూపొందించారని అన్నారు. పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీల నుంచి 56 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మైనారిటీ స్కూల్స్ ఆర్‌సీవో మహ్మద్ అబ్దుల్ బాసిద్, ప్రిన్సిపాళ్లు సూర్యకాంత్‌రెడ్డి, డాక్టర్ సయ్యద్ హమీద్, శోభన్ బాబు, నిషార్ ఫాతిమా, గంగాధర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ హరోన్ ఖాన్, కాంగ్రెస్ నాయకుడు ఎజాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


